Type Anything.., You Get World Wide Search Results Here. !

అమ్మాయి కలలు - Girl Dreams - Telugu Moral Stories

అమ్మాయి కలలు - Girl Dreams - Telugu Moral Stories

అనగనగా ఒక ఊరిలో ఒక అమ్మాయి వుండేది. ఆ అమ్మాయి రోజూ ఆవు పాలు పితికి ఊరిలో అమ్మడానికి వెళ్ళేది. వచ్చిన డబ్బులతో రోజులు గడుపుకునేది. ఒక రోజు ఆవు మామూలుగా కన్నా కొంచం యెక్కువ పాలు ఇచ్చింది. అది చూసి అమ్మాయి చాల సంతోషించింది. రోజు తీసుకువెళ్ళే బిందె కన్నా పెద్ద బిందిలో పాలు నింపుకుని తలపైన పెట్టుకుని ఊరివైపు బయలుద్యారింది.
దారిలో సంతోశంగా నడుచుకుంటూ యెన్నో ఊహలు అల్లటం మొదలెట్టింది. “ఈ రోజు ఇచ్చినట్టు రోజు ఆవు పాలు ఇస్తే నాకు రోజు యెక్కువ ఆదాయం వస్తుంది.


ఆ వచ్చిన అధికపు ఆదాయం నేను ఖర్చు పెట్టకుండా ఒక మూటలో దాచేస్తాను.
కొద్ది రోజులకి ఆ మూటలో చాలా డబ్బులు జమవుతాయి. అప్పుడు ఇంకో ఆవుని కొంటాను. అలా, అలా కొద్ది రోజులలో నా దెగ్గిర చాలా ఆవులు వుంటాయి. అవి చూసుకోటాని పాలేరాళ్ళను పెడతాను. నేను రోజూ ఇలా యెండలో ఊరికి వెళ్ళే అవసరం వుండదు. అప్పుడు నేను కూడ తెల్లగా అయిపోతాను.


వెళ్ళి ఒక కొత్త పట్టు చీర కొనుక్కుంటాను. కొత్త పట్టు చీరలో నేను చాల అందంగా కనిపిస్తాను. చీరకు తగ్గట్టు సంతలో గాజులు, గొలుసు కూడ కొనుక్కుంటాను. ఊరిలో యెవరింట్లోనైనా పెళ్ళి ఐతే, ఆ పెళ్ళికి చక్కగా తలస్నానం చేసి, కొత్త పట్టు చీర కట్టుకుని, నగలు పెట్టుకుని, జడలో పూలు పెట్టుకుని వెళ్తాను.


అక్కడ నేను ధగ ధగా మెరిసిపోతూ చాలా అందంగా కనిపించగానే నాకు చాలా సంబంధాలు చెబుతారు. కాని నాకు నచ్చిన సంబంధం వచ్చే దాక నేను యేది ఒప్పుకోను” నచ్చని సంబంధం ఒప్పుకోను అనుకుంటూ ఆ అమ్మయి గట్టిగా తల అడ్డంగా ఊపింది. తల మీద రోజు మోసేదానికన్నా యెక్కువ బరువు వుందన్న విషయం మరిచిపోయింది.


ఢడేలుమని బిందె తలనించి పడి ముక్కలయిపోయింది. పాలన్నీ నేలపాలయ్యాయి.
ఆ పాలూ అమ్మలేదూ, యెక్కువ డబ్బులూ సంపాదించలేదు, ఆవులూ కొనలేదూ, పాలెరాళ్ళనీ పెట్టుకోలేదు, పట్టు చీరా కొనలేదు, గాజులూ కొనలేదు – ఊహించినవన్ని ఊహలలోనే వుండి పోయాయి. పగటి కలలు కనే బదులు చేస్తున్న పని శ్రద్ధగా చేస్తే బాగుండేదని బాధ పడుతూ ఆ అమ్మాయి తిరిగి ఇంటివైపుకు వెళ్ళి పోయింది.




Top

Bottom