Type Anything.., You Get World Wide Search Results Here. !

నక్క ఆహ్వానం - Fox invitation - Telugu Moral Stories

నక్క ఆహ్వానం - Fox invitation - Telugu Moral Stories

ఒక రోజు ఒక నక్క తన మిత్రుడైన కొంగను భోజనానికి ఆహ్వానించింది. కొంగ సంతోషంగా ఒప్పుకుంది.

సాయంత్రం నక్క భోజనం తయారు చేయడం మొదలు పెట్టింది. నక్కకు అత్యాశ ఎక్కువ. కొంగని భోజనానికి పిలిచింది కాని కొంగ ఎక్కువ తినేస్తుందేమో అని భయం. అందుకనే ఒక ప్లాన్ వేసింది.

నిర్దారించుకున్న సమయానికి కొంగ తలుపు తట్టింది. నక్క ఇంట్లోంచి మంచి మంచి వాసనలు వస్తున్నాయి. కొంగకు నోరూరింది. ఇద్దరు మిత్రులు భోజనానికి రెడీ అయ్యారు.

నక్క ఇద్దరికి భోజనం చదునైన పళ్ళాలలో తీసుకుని వచ్చింది. పళ్ళం అలా ఫ్లాట్ గా వుంటే కొంగ పక్షిముక్కుతో ఎక్కువ తినలేక పోయింది. పాపం ఏదో కష్ట పడుతూ కొంచం కొంచం తినగలిగింది. నక్క మట్టుకు పళ్ళం నాక్కుని నాక్కుని మొత్తం తినేసింది. కొంగ ఆకలితోనే ఇంటికి వెళ్లి పోయింది.

కొద్ది రోజులు గడిచాయి.

ఈ సారి కొంగ నక్కని భోజనానికి పిలిచింది. నక్క వస్తానని మాట ఇచ్చింది.

అనుకున్న సమయానికి నక్క కొంగ ఇంటికి వెళ్ళింది. కొంగ ఇల్లు వంట సువాసనలతో ఘుమ ఘుమలాడి పోతోంది. కొంగ డిన్నర్ కి సూప్ చేసింది. చేసిన సూప్ని రెండు కూజాలలో తీసుకుని వచ్చింది. కూజా మెడ పొడూగ్గా వుంటుంది కదా? అందులోని సూప్ నక్క ఎలా తింటుంది. తిన లేక పోయింది. కాని కొంగ మట్టుకు పక్షిముక్కు కూజలోకి ముంచుకుని హాయిగా సూప్ అంతా లాగించేసింది. అలా ఆ రోజు నక్క ఆకలితో ఇంటికి వెళ్ళాల్సి వచ్చింది.

మనం ఇతర్లతో ఎలా ఉంటామో, వారు మనతో అలాగే ప్రవర్తిస్తారు.

Top

Bottom