నూతిలో నక్క - Fox in Well - Telugu Moral Stories
అనగనగా ఒక నక్క అడవిలో రాత్రిపూట చీకటిలో తిరుగుతూ ఒక బావిలో పడిపోయింది. బావి చాలా లోతుగా వుంది. యెంత ప్రయత్నం చేసినా ఆ నుయ్యిలోంచి నక్క బయటికి రాలేక పోయింది. తెలారేదాక అలాగే నూతిలో ఉండిపోయింది. మొన్నాడు ఆ బావి దేగ్గిరకి ఒక మేక వచ్చింది.
“అమ్మయ్య! మనం బయట పడచ్చు”, అనుకుని నీళ్ళల్లో ఉన్న నక్క అనుకుంది.
మేక బావిలోకి చూసింది. చూస్తే అక్కడ నక్క కనిపించింది.
“ఇదేంటి? బావిలో ఎం చేస్తున్నావు?” అని అమాయకంగా అడిగింది మేక.
“ఈ బావిలో నీళ్ళు యెంత బాగుంటాయో తెలుసా? ఆ నీళ్ళు తాగడానికే ఇక్కడికి వచ్చాను. అసలు చక్కర కలిపినంత తీయగా వున్నాయి!” అని తెలివిగా చెప్పింది నక్క.
“అవునా! నిజమా?” అని అడిగింది మేక.
“కావాలంటే నువ్వు దిగి చూడు? అసలు ఇలాంటి నీళ్ళు నువ్వు ఎప్పుడు తాగి ఉండవు” అంది నక్క.
అమాయకురాలైన మేక ముందు వెనక ఆలోచిన్కాకుండా నూతి లోకి దున్కేసింది. నీళ్ళు తాగింది. కొంత సేపటికి నక్క లానే మేక కూడా ఇరుక్కు పోయింది.
“ఇప్పుడు బయటికి వెళ్ళడం ఎలా?” అని నక్కని అడిగింది.
“ఓస్! దానిదేముంది! ముందు నీ వీపు పై ఎక్కి నేను బయటికి వెళ్లి, తరువాత నిన్ను పైకి లాగెస్తాను!” అని ఐడియా ఇచ్చింది నక్క.
సరే బాగానే ఉంది అనుకుని మేక ఒప్పుకుంది.
నక్క మేక వీపెక్కి చెంగున ఒక గెంతు వేసి నూతి లోంచి బయట పడింది! “బ్రతుకు జీవుడా!” అనుకుంది.
మేక బయటికి రావడానికి చేయి అందించ మని అడిగింది. “నేను నిన్ను ఎలా లాగుతాను, బావి లోతుగా వుంది, నువ్వు బరువుగా వున్నావు” అని నవ్వుకుంటూ నక్క వెళ్లి పోయింది.
మేకకు మొత్తానికి నక్క చేసిన మోసం అర్ధం అయ్యింది. కాని ఏమి లాభం? నూతిలో దిగే ముందరే బయటికి ఎలా వస్తామన్న విషయం ఆలోచించాల్సింది కదా?
